ఆ పార్లమెంట్ స్థానాల కాంగ్రెస్ ఇంఛార్జ్లు వీళ్లే
X
గాంధీ భవన్ లో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఆ పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ స్థానాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని పలు పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంఛార్జ్ లను నియమిస్తూ పీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ స్థానాల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ, పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ ఎంపీ స్థానాల బాధ్యతలను అప్పగిస్తూ పీఏసీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేత షబ్బీర్ అలీ తెలిపారు. ఇక మిగిలిన ఎంపీ సెగ్మెంట్లకు కూడా త్వరలోనే ఇంఛార్జ్ లను నియమిస్తామని చెప్పారు. ఇక నేటి పీఏసీ సమావేశంలో తెలంగాణ నుంచి సోనియా గాంధీని ఎంపీగా పోటీ చేయించాలని తీర్మానం చేశారు.