సిటీలో డ్రగ్స్ మాటలు వినబడొద్దు.. హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి
X
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్ పోలీసులతో సీపీ కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహానగరంలో డ్రగ్స్, గంజాయి కట్టడిపై పోలీస్ ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు నెలల్లో డ్రగ్స్ మహమ్మారిని సిటీ నుంచి పారదోలాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సిటీలో డ్రగ్స్, గంజాయి అనే మాటలు వినబడవద్దని సూచించారు. తన పేరు చెప్పుకొని కొందరు పైరవీలకు పాల్పడుతున్నారని, అలాంటి వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి వల్ల యువత పెడదారి పట్టి నేరాలకు పాల్పడుతున్నారని, డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిర్మూళించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులతో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.