Home > తెలంగాణ > 'గద్దర్ అవార్డు' ప్రతి పేదవాడికి దక్కిన గౌరవం.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

'గద్దర్ అవార్డు' ప్రతి పేదవాడికి దక్కిన గౌరవం.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

గద్దర్ అవార్డు ప్రతి పేదవాడికి దక్కిన గౌరవం.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
X

గద్దర్ అవార్డు తెలంగాణలోని ప్రతి పేద వాడికి దక్కిన అవార్డు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్దర్ జయంతి పురస్కారాన్ని పురస్కరించుకొని నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించడం చాలా గొప్ప విషయమన్నారు. గద్దర్ అవార్డులు ప్రకటించిన రోజే నిజమైన తెలంగాణ అచ్చిందనే అభిప్రాయం తనకు కలిగిందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. అది గద్దర్ కు ఇచ్చిన అవార్డు కాదని తెలంగాణలో ప్రతి పేదవాడికి ఇచ్చిన అవార్డు అని అన్నారు. ఆయనకు గౌరవం దక్కిందంటే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు గౌరవం దక్కినట్లేనని అన్నారు. అలాగే అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ' అనే పాటను రాష్ట్ర గేయంగా ప్రకటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

'మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైన కానరాడు మానవత్వంబున్నవాడు' అనే ఒక తాత్విక గేయాన్ని రాసిన గొప్ప వ్యక్తి అందేశ్రీ అని అన్నారు. మనుషులపైనా, మట్టిపైనా ప్రేమ ఉంటే ఓ పేదవాడు కూడా మహాకవి కాగలరని అందెశ్రీ నిరూపించారని కొనియాడారు. అలాంటి అందెశ్రీని రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి నిజమైన గౌరవం దక్కిందని అన్నారు. అన్నం తినకపోయినా ఉండొచ్చేమో గానీ ఆత్మగౌరవం లేకుండా ఉండలేమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ, ఆత్మగౌరవంతో బతుకున్నారని అన్నారు.

ఆటో డ్రైవర్లపై కొందరికీ కొత్తగా ప్రేమలు పుట్టుకొస్తున్నాయని సెటైర్లు వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వారు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. మహిళలకు, ఆటో డ్రైవర్లకు మధ్య ఏదో పంచాయితీ ఉన్నట్లు వాతావరణం సృష్టించారని, కానీ అది సరైంది కాదని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ ఇంట్లో కూడా మహిళలు ఉంటారని, వాళ్ల మధ్యన తగాదా పెట్టడం మంచి సంప్రదాయం కాదని అన్నారు. ఏఐటీయూసీ ఆటో సంఘానికి తాను రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానని, ఆటోవాళ్ల గురించి మాట్లాడే అర్హత అందరి కంటే ఎక్కువగా తనకే ఉందని అన్నారు. ఆటో కార్మికుల కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని అన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ కోసం ఏం చేయాలో ప్రభుత్వానికి సూచన చేయాలని విపక్షాలను కోరారు. అలాగే ఆటో డ్రైవర్లను పిలిచి చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కూనంనేని కోరారు.




Updated : 9 Feb 2024 9:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top