అభయహస్తం దరఖాస్తుదారులపై సైబర్ నేరగాళ్ల టార్గెట్
X
ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఇటీవల ప్రజా పాలన పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం గత నెల 28న మొదలై ఈ నెల 6తో ముగిసింది. ఇక ఈ నెల 17 వరకు లబ్దిదారులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ సైట్ లో నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు అభయహస్తం దరఖాస్తుదారులను టార్గెట్ చేసుకున్నారు. వాళ్లకు ఫోన్ చేసి తాము ప్రభుత్వ అధికారులమని.. పథకాల మంజూరు గురించి ఫోన్ చేశామని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు, ఇతర ప్రభుత్వ పథకాలు మంజూరు అయ్యాయని, ఓటీపీ చెప్పాలంటూ దరఖాస్తుదారులకు ఫోన్ చేస్తున్నారు. దీంతో ఇది నిజమని నమ్మిన కొంతమంది దరఖాస్తుదారులు సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసం పోయినట్లు తెలుస్తోంది. ఓటీపీ చెప్పగానే వాళ్ల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బు మాయమైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ కూడా ఓటీపీ నెంబర్లు చెప్పవద్దని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫోన్లు రావని, ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.