దేశ సంపద అదానిదో.. అంబానిదో కాదు: డిప్యూటీ సీఎం భట్టి
X
దేశ సంపద అదానీకో, అంబానీకో ఇవ్వడానికి కాదు స్వాతంత్రం తెచ్చుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.సికింద్రాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సోమవారం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. దేశ సంపద ప్రజలకే ఉండాలని అన్నారు. అంతేగానీ దేశ సంపదను అదానికో, అంబానికో పంచి ఇవ్వడానికి కాదు స్వాతంత్య్రం తెచ్చుకుందని అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్ర ఉండాలని సోనియాగాంధీ భావించారని, అందుకే పార్లమెంట్ లో అందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. తెలంగాణకు నిజమైన ఓనర్లు ప్రజలు అని భావించే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని, సంపద మొత్తం కొంతమంది చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. తమ ప్రభుత్వంపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని, అన్ని అబద్ధాలు చెప్పామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ అంటేనే నమ్మకం.. నమ్మకం అంటేనే కాంగ్రెస్ అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. పథకాల అమలుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అయితే వాటన్నింటినీ అధిగమించి పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, త్వరలోనే మరి కొన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు. పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల కోసమే ప్రతిపక్షాలు తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ ఆ ఎన్నికల్లో తమ గెలుపునెవరూ ఆపలేరని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, త్వరలోనే కేంద్రంలో కూడా తమ ప్రభుత్వం వస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు.