రాష్ట్రాన్ని అప్పుల నుంచి గట్టెక్కిస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి
X
రాష్ట్రాన్ని అప్పుల నుంచి గట్టెక్కిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజా పాలన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ అంటే తనకు ప్రాణమని, రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పని చేస్తాని అన్నారు. తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా పాలన చేస్తామని అన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని అన్నారు. 10 ఏండ్లు పరిపాలన చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చామని అన్నారు. రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టిస్తామని అన్నారు. విద్యుత్ వెలుగులు పెంచుతామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నిష్ణాతులతో మాట్లాడడానికి తనకు ఎలాంటి భేషజాలాలు లేవన్న భట్టి.. రాజ్యాంగం, ఫెడరలిజం స్ఫూర్తితో రాష్ట్రానికి రావలసిన ఆదాయ వనరులను కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ముందుకు వెళ్తామని అన్నారు. రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు కోసం కేంద్రానికి విన్న విస్తామని, ఇందులో ఎలాంటి భేషజాలాలకు పోమని అన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలే తప్ప అన్ని వేళలా కాదని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం అందరి సమిష్టి బాధ్యత అన్న ఆయన.. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ తన కోసమే ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే దిశగా తమ పరిపాలన సాగుతుందని అన్నారు. మొదటిసారి ఓటు వచ్చి అభివృద్ధికే పట్టం కట్టిన యువతీ యువకులందరికీ శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు పరిశ్రమలు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామని, తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను నిజం చేయడంతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపుతామని తెలిపారు.