Home > తెలంగాణ > గద్దర్ పేరుతో జాతీయ అవార్డు ఇవ్వండి.. ఎమ్మెల్సీ దేశపతి

గద్దర్ పేరుతో జాతీయ అవార్డు ఇవ్వండి.. ఎమ్మెల్సీ దేశపతి

గద్దర్ పేరుతో జాతీయ అవార్డు ఇవ్వండి.. ఎమ్మెల్సీ దేశపతి
X

గద్దర్ పేరుతో జాతీయ స్థాయిలో ఓ అవార్డు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. గద్దర్ పేరు మీద నంది అవార్డులను ఇవ్వనుండటం చాలా మంచి విషయమని అన్నారు. అయితే నంది అవార్డుకు మించి గద్దర్ పేరు జ్ఞానపీఠ అవార్డులాగా ఏదైనా జాతీయ అవార్డు ఇస్తే బాగుంటుందని అన్నారు. అలా చేస్తే గద్దర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగి ఆయన గొప్పతనం అందరికీ తెలుస్తుందని అన్నారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు గద్దర్ ఓ ప్రేరణ అవుతారని అన్నారు. గద్దర్ ను కేవలం సినిమాలకే పరిమితం చేయొద్దని, అంతకు మించిన విశాల వ్యక్తిత్వం ఆయన సొంతమని అన్నారు. పాటను విప్లవీకరించి ప్రజల పరం చేసిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. తన పాటలో దళిత, బహుజన చైతన్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి గద్దర్ అని అన్నారు. గద్దర్ తన పాటతో భూస్వామ్య, పెట్టుబడిదారీ, మతతత్వ రాజకీయాలతో పాటు జీతగాళ్ల రాజకీయాలను ప్రజలు ముందుకు తీసుకొచ్చారని అన్నారు.

గద్దర్ ఇప్పటి వరకు ఎన్నో పాటలు రాశారని, కానీ వాటిని అచ్ఛు మాత్రం వేయించలేకపోయారని అన్నారు. ప్రభుత్వం ఆయన పాటలను, సాహిత్యాన్ని అచ్చువేయించాలని అన్నారు. అలాగే ఆయన సాహిత్యంపై పరిశోధన చేయడానికి ఓ పీఠాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఆయన పేరు మీద ఓ స్మృతి మందిరాన్ని ఏర్పాటు చేసి ఆయన గోచి, గొంగడి, కర్ర, జెండా, గజ్జెలు, డప్పు, డోలక్, ఆయన రాసిన పెన్ను.. ఇలా ఆయనకు సంబంధించిన వస్తువులను అందులో పెడితే బాగుంటుందని అన్నారు. అలాగే ఆయన ఫోటోను రవీంద్రభారతిలో పెట్టాలని, ఆయన పేరు మీద ఒక పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించాలని దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.


Updated : 15 Feb 2024 1:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top