మేడారం జాతర.. ముందుగా రాజన్నకే మొక్కుల చెల్లింపు
X
వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేడారం జాతర నేపథ్యంలో తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పర్వదినం, పైగా సోమవారం కావడంతో పాటు మేడారం జాతరకు ముందు రాజన్నకే మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో వేములవాడ రాజన్న టెంపుల్ కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో కల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా భక్తులు కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తున్నారు. అనంతరం స్నానాలు ఆచరించి స్వామి వారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆ తర్వాత రాజన్నను దర్శించుకుంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయం సమీపంలో ఉన్న బద్దిపోచమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఒక్క సారిగా ఆలయం కిక్కిరిసి పోయింది. మేడారం జాతర నేపథ్యంలో దుకాణాల్లో పెద్ద ఎత్తున బంగారం ( బెల్లం) కొనుగోళ్లు జరుగుతున్నాయి. వేములవాడ సమీపంలోని దుకాణాలు రద్దీగా మారాయి. మొత్తానకి మేడారం జాతర సందర్భంగా వేములవాడ రాజన్న దేవాలయాన్ని భక్తుల తాకిడి మొదలైంది. కాగా తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2024 ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటన విడుదల చేశారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గఢ్ తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటున్నారు.