కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తా.. ఈటల రాజేందర్
X
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధిష్టానం అవకాశం ఇస్తే కరీంనగర్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అక్కడ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడ భక్తులకు వృక్ష ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు కరీంనగర్ జిల్లా రాజకీయ భవిష్యత్తును ఇచ్చిందని తెలిపారు. తనకు అవకాశం వస్తే తప్పక కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఈటల అన్నారు. సర్కార్ కల్పించే సంక్షేమ పథకాల వల్ల ఎవరికి హాని కలుగవద్దని అభిప్రాయపడ్డారు.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గంలో ప్రభుత్వం సహాయం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం కృషి చేస్తానని అన్నారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా తన వంతు పాత్ర పోషిస్తానని, గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకు పోతానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.