సీఎంను కలిసిన నళిని.. డీఎస్పీగా మళ్లీ ఛాన్స్!
X
మాజీ డీఎస్పీ నళిని శనివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నళిని సీఎంకు శుభాకాంక్షులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రం వచ్చాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ప్రచారం జరిగింది. తన పదవిని తిరిగి ఇచ్చేలా చొరవ తీసుకోవాలని అప్పటి సీఎం కేసీఆర్ ను కలిసి నళిని వినతి పత్రం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలో నళిని సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే నళినికి మళ్లీ డీఎస్పీగా ఉద్యోగం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.