ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం కావడం బాధాకరం.. మాజీ మంత్రి హరీశ్ రావు
X
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి సీఎం కావడం తనను బాధించిందని అన్నారు. ఉద్యమ సమయంలోనైనా.. రాష్ట్రం వచ్చాకనైనా.. లేదా తాను సీఎం అయ్యాకనైనా తెలంగాణ అమరవీరులకు ఒక్క రోజు కూడా నివాళి అర్పించని వ్యక్తి (రేవంత్ రెడ్డి) సీఎం అవడం దురదృష్టకరమని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవడురా తెలంగాణ అన్నది అంటూ తుపాకి పట్టుకొని ప్రజలను తరిమిన రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో సీఎం కుర్చీలో కూర్చోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తమను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, తమ పాత్రను ప్రజల కోసం వంద శాతం నిర్వర్తిస్తామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దాక కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతామని అన్నారు. అసెంబ్లీలో వదిలేది లేదు.. కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని అన్నారు. అసెంబ్లీలో 39 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని, పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా 39 మంది ఎమ్మెల్యేలం అండగా ఉంటామని అన్నారు.
నాడు కేసీఆర్ తెలంగాణ గురించి కొట్లాడుతుంటే ఇది అయ్యే పని కాదని హేళన చేశారని అన్నారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ తెచ్చిందెవరంటే కేసీఆర్, బీఆర్ఎస్ అనే చెబుతారే తప్ప.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు అని ఎవరూ చెప్పరని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం గల్లీలో అయినా ఢిల్లీలో అయినా గొంతెత్తి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. కేసీఆర్ చేసిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే మేడిగడ్డపై రేవంత్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని అన్నారు. ఇటీవల పార్టీ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని అన్నారు.