ఆటో డ్రైవర్లెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. Harish Rao
X
రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లెవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. పటాన్ చెరులో పర్యటించిన హరీశ్ రావును ఆటోడ్రైవర్లు కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. ఈఎంఐలు కూడా కట్టలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో నడి రోడ్డుమీద పడ్డామని ఆటో కార్మికులు వాపోయారు.ఈ సందర్భంగా హరీశ్ రావు ఆటోడ్రైవర్లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..
ఆటో డ్రైవర్లు అధైర్య పడకండి అండగా ఉంటామని అన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అసెంబ్లీలో బీఆర్‌ఎస్ గళం విప్పుతుందన్నారు. ఆత్మహత్యలు వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.
ప్రభుత్వం నెలకు 10 వేలు ఇచ్చేదాక పోరాడుదామని భరోసానిచ్చారు. బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీస్కీమ్ కు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆటో డ్రైవర్ల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని మాత్రమే తాము చెబుతున్నామని అన్నారు. ఇక హరీశ్ రావు వెంట బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ఆటో యూనియన్ నేతలు, ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు.