సీఎం రేవంత్ ను కలిసిన కరణ్ అదానీ
X
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ భేటీ అయ్యారు. సంస్థ ప్రతినిధులతో కరణ్ అదానీ బుధవారం సెక్రటేరియట్ లో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం అదానీ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ..రాష్ట్రంలో తమ గత ప్రాజెక్టులు కొనసాగుతాయని, మరిన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరామని అన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు తమ కంపెనీ కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్క్ ఏర్పాటుతో పాటు డేటా సెంటర్ ను కూడా ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సీఎం సెక్రటరీ షాన్వాజ్ ఖాసీం, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.