తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా డాక్టర్ జి.చిన్నారెడ్డి
X
తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిని ప్రభుత్వం నియమించింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డిని.. పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేబినెట్ హోదా ఉన్న తెలంగాణ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమించడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో చిన్నారెడ్డి పేరును తొలగిస్తూ మేఘా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డిపై మేఘారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
కాగా చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న చిన్నారెడ్డి.. వనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 1989లో మళ్లీ పోటీ చేసి బాలకృష్ణయ్యపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 1999 ఎన్నికల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డిపై చిన్నారెడ్డి 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2004 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్సార్ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో రావుల చేతిలో ఓటమి పాలైన చిన్నారెడ్డి.. 2014 ఎన్నికల్లో గెలుపొందారు. అలాగే 2018 ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిన్నారెడ్డి పోటీ చేయలేదు.