ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. సూపర్ అంటున్న బీఆర్ఎస్ కేడర్
X
బీఆర్ఎస్ పార్టీలో మాజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తర్వాత అంతటి చరిష్మా కలిగిన నేతలు హరీశ్ రావు, కేటీఆర్. ఇక వీళ్లిద్దరూ బావాబామ్మర్దులు అనే విషయం తెలిసిందే. కాగా ఈ బావాబామ్మర్దులిద్దరూ ఇవాళ ఒకే కారులో సందడి చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు సాయంత్రం జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు , కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కారు నడుపుతుండగా.. హరీశ్ రావు ఆయన పక్కనే కూర్చున్నారు. హరీశ్ రావు, కేటీఆర్ లకు సంబంధించిన ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కాగా నిన్నటిదాక సాగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క తదితరులకు హరీశ్ రావు, కేటీఆర్ లిద్దరూ ధీటైన సమాధానాలు ఇచ్చారు. కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన గైర్హాజరీలో హరీశ్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ బాధ్యతలను మోస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో బావాబామ్మర్దుల ఫోటోలను చూసిన బీఆర్ఎస్ కేడర్.. 'సూపర్' అంటూ కామెంట్ చేస్తున్నారు.