వనదేవతల దీవెనలు సమస్త ప్రజానీకంపై ఉండాలి.. మాజీ మంత్రి హరీశ్ రావు
X
ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం జాతర నిన్న (బుధవారం) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 24 వరకు మొత్తం నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనుంది. జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. మేడారంలో ఎక్కడ చూసినా జనసంచారమే కనిపిస్తోంది. కాగా మేడారం జాతర సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పోరాట స్ఫూర్తి, త్యాగాల కీర్తికి నిదర్శనం అయిన వనదేవతల దీవెనలు సమస్త ప్రజానీకం పై ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నానని అన్నారు.
తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వస్తున్న భక్తులకు ఆయన పలు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. ప్రయాణం చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
కాగా మేడారం జాతరకు వీఐపీల తాకడి మొదలైంది. ఇవాళ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మేడారం వెళ్లి వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం గిరిజన దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అలాగే పలువురు కేంద్రమంత్రులు కూడా వనదేవతలను దర్శించుకుంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డిలు కూడా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారు. బంగారాన్ని సమర్పిస్తారు. ఈ మేడారం జాతర కోసం పదివేల మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది. 700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు లక్కవరం నుంచి నీటిని జంపన్నవాగుకు విడుదల చేశారు. ఇక పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నలభై ప్రాంతాల్లో స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు పది లక్షల వరకూ పెట్టుకునే వీలుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మేడారం జాతరకు మూడు కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది.