Home > తెలంగాణ > ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టులను అప్పగించలేదు.. Harish Rao

ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టులను అప్పగించలేదు.. Harish Rao

ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రాజెక్టులను అప్పగించలేదు.. Harish Rao
X

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం తమపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రాష్ట్ర ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పదేళ్లు కేంద్రం ఒత్తిడి చేసినా తాము ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించలేదని అన్నారు. కానీ రెండు నెలలు కూడా గడవకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించిందని, దీంతో రాష్ట్రంలో నీటి కొరత రాబోతుందని అన్నారు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రగతి భవన్, కొత్త సచివాలయం నిర్మిస్తే నాడు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని, కానీ నేడు వాటిని వాళ్లే వాడుకుంటున్నారని అన్నారు. ప్రగతి భవన్‌లో 150 రూములు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ అప్పట్లో ఆరోపించారని, ఎన్ని ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా అడిగితే ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామే తప్ప తామేం తొందరపడటం లేదని అన్నారు. రైతుబంధు ఇస్తున్నామని తాను చెబితే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని అన్నారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ సంగతి పక్కన పెడితే జనవరిలో రూ.2 వేల పింఛన్ కూడా ఇవ్వలేదని అన్నారు. వృద్ధులకు ఒక నెల పింఛన్ ఎగ్గొట్టారని అన్నారు.

ఇళ్లకు ఉచిత కరెంట్, 15వేల రైతు బంధు, డిసెంబర్ 9న రుణమాఫీ, వడ్లకు బోనస్.. ఇలాంటి జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకోగా.. ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని అన్నారు. పింఛన్ ఎగవేత, రైతుబంధు ఇవ్వకపోవడం, మాట ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్-1 జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, కరెంటు కోతలు, కాలిపోతున్న మోటార్లు.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి ముక్కలవుతోందన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని కూటమి పార్టీలే చెబుతున్నాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతోందని, కేంద్రంలో కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి హామీలను అమలు చేయడం కష్టమని రేవంత్ చెప్పబోతున్నారని ఆరోపించారు. అందుకే ఎన్నికల కోడ్ వచ్చే లోపే ఎన్నికల హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయాయని, తెలంగాణలోనూ అదే జరగబోతుందని అన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, దానికి వేసే ఓటు నిరుపయోగమేనని అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనన్న ఆయన.. ఢిల్లీలో తెలంగాణ గొంతును బలంగా వినిపించాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ కు బలం ఉండాలని అన్నారు. రాముడి పేరుతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టేందకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం యాదాద్రి దేవాలయాన్ని కట్టినా దేవుని పేరుతో ఏనాడు ఓట్లు అడగలేదని అన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ పై ఎంతో నమ్మకం ఉన్నదని, కేవలం 1.8 శాతం ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పాలన తీరు అర్థమైందని, అందుకే వారు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Updated : 4 Feb 2024 12:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top