Home > తెలంగాణ > నల్గొండపై ప్రేమ ఉంటే ఆ ప్రాజెక్టులపై మాట్లాడు.. మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్

నల్గొండపై ప్రేమ ఉంటే ఆ ప్రాజెక్టులపై మాట్లాడు.. మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్

నల్గొండపై ప్రేమ ఉంటే ఆ ప్రాజెక్టులపై మాట్లాడు.. మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నల్గొండపై నిజంగా ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడాలని సవాలు విసిరారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల నల్గొండకు తీవ్ర నష్టం జరుగుతుందని, సాగునీళ్లు.. తాగునీళ్లు ఉండవని అన్నారు. దమ్ముంటే వీటిపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడాలని అన్నారు. రైతు బంధు పడడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలనడం ఏం సంస్కారం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రైతుబంధు పడడం లేదని జడ్పీ చైర్మన్‌గా బాధ్యతతో సందీప్ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని అన్నారు. దళిత బంధు కోసం గత ప్రభుత్వం కేటాయించిన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గురించి పచ్చి అబద్ధాలు చెప్పిందని, బీఆర్ఎస్, బీజేపీల మధ్య సంబంధం ఉందని దుష్ప్రచారం చేసిందని అన్నారు. కానీ బీజేపీ నేతలు బండి సంజయ్, రఘనందన్ రావు, ఈటల రాజేందర్‌లను ఓడించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల హామీలను తప్పించుకోవడానికి అసలు అప్పును రెట్టింపు చేసి గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఎన్నికల సమయంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఉద్యోగాల కల్పనపై గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్.. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ 4 వేలకు పెంచలేదని, రూ.2 వేల ఫింఛన్‌ను కూడా సమయానికి ఇవ్వడం లేదని అన్నారు. రైతుబంధు, పింఛన్, రుణమాఫీ, కరెంట్, ఉద్యోగాలు, వడ్లకు బోనస్ వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని, కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాల్లో, తండాల్లో చర్చకు పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయేనని, కాంగ్రెస్, బీజేపీలు వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయని అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుందని అన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు.


Updated : 2 Feb 2024 4:36 PM IST
Tags:    
Next Story
Share it
Top