Home > తెలంగాణ > కేసీఆర్ వల్లే రేవంత్ సీఎం అయ్యారు.. Harish Rao

కేసీఆర్ వల్లే రేవంత్ సీఎం అయ్యారు.. Harish Rao

కేసీఆర్ వల్లే రేవంత్ సీఎం అయ్యారు.. Harish Rao
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం, కాంగ్రెస్ నేతలు మంత్రులు అయ్యారంటే అది కేసీఆర్ వల్లేనని అన్నారు. నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయకపోయుంటే వీళ్లంతా ఇవాళ ఆ స్థానంలో ఉండేవారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని 420 హామీలనని ఎద్దేవా చేశారు. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరిని చుట్టేసిందన్నట్లు ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపు హామీలను ప్రజలు నమ్మారని అన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు ఇబ్బందిపడుతున్నారని, మరిన్ని బస్సులు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతానన్నారని, కానీ ఇప్పటి వరకు పెంచలేదని అన్నారు. మహిళలకు రూ.2500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశామని అన్నారు. తాము దావోస్ కు వెళ్తే దండగ అని నాడు కాంగ్రెస్ నేతలు అన్నారని, మరి నేడు వాళ్లు ఎందుకు దావోస్ వెళ్లారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, మేం కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లోనే ఉండేవారని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాను బాగా వాడుకోవాలని సూచించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని చెప్పినట్లే నేడు రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఎండిపోయిన పొలాలపై రీల్స్ చేసి రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు.

కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఓడిపోయిందన్న హరీశ్ రావు.. ఎవరూ అధైర్యపడొద్దని, కార్యకర్తలకు పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని అన్నారు. చీకటి పోయి వెలుగు వచ్చినట్లు బీఆర్ఎస్ కూడా ఓటమి నుంచి గెలుపు బాట పడుతుందని అన్నారు. ఇది కేవలం ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. స్థానిక సంస్థలకు ఇంకో 6 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అలా అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం చాలా ఈజీ అని అన్నారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంటుందని, దీంతో సర్పంచ్, ఎంపిటీసీ, జెడ్టీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల గెలుపు తథ్యమని అన్నారు. వాళ్లు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ తాము మాత్రం నిజాలు చెప్పే తిరిగి అధికారంలోకి వస్తామని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చామని అన్నారు. మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని అన్నారు. భారీ మెజారిటీతో మెదక్ ఎంపీ సీటును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

Updated : 28 Jan 2024 9:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top