Home > తెలంగాణ > సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. ఏ విషయం గురించి అంటే?

సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. ఏ విషయం గురించి అంటే?

సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. ఏ విషయం గురించి అంటే?
X

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో తెలంగాణ ఆర్టీసీ, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. టీఎస్ఆర్టీసీని బలోపేతం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో కూడా తెచ్చామని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డే అమలు, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు , 2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్ చెల్లింపుల గురించి హరీశ్ రావు తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేస్తూ బిల్లు తీసుకొచ్చామని, దానికి గవర్నర్ ఆమోదం కూడా లభించిందని లేఖలో పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ బిల్లును అమలు చేసే ‘అపాయింటెడ్ డే' మిగిలే ఉందని, ఎన్నికల కోడ్ వల్ల తమ ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయిందని అన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే దాన్ని పూర్తి చేస్తామని తాము ఆనాడు చెప్పామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా తాము అధికారంలో రాగానే అపాయింటెడ్ డే ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ దాన్ని ఇంత వరకు అమలు చేయలేదని అన్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్ జర్నీ వల్ల ఆర్టీసీ కార్మికులపై పని భారం పెరిగిందని అన్నారు. బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్ లోడ్ వెహికిల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తోందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల శ్రమను దృష్టిలో పెట్టుకొని ‘అపాయింటెడ్ డే’ని వెంటనే ప్రకటించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ విలీనాన్ని పూర్తి చేసి ఆర్టీసీ కార్మికులకు వచ్చే నెల నుంచైనా ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని కోరారు. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో రెండు వేల బస్సులను కొనుగోలు చేసి వాడకంలోకి తీసుకు రావాలని సూచించారు. అదే విధంగా 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, చెప్పినట్లుగానే బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు లేఖ ద్వారా కోరారు.



Updated : 25 Feb 2024 1:31 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top