Home > తెలంగాణ > ఐదు స్కీంలకు ఒకే అప్లికేషన్.. దరఖాస్తులో ఏ వివరాలు నింపాలంటే..

ఐదు స్కీంలకు ఒకే అప్లికేషన్.. దరఖాస్తులో ఏ వివరాలు నింపాలంటే..

ఐదు స్కీంలకు ఒకే అప్లికేషన్.. దరఖాస్తులో ఏ వివరాలు నింపాలంటే..
X

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఐదు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ విడుదల చేశారు. అభయ హస్తం పేరుతో ఈ దరఖాస్తు అందుబాటులోకి తెచ్చారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లో అప్లికేషన్ అందించాల్సి ఉంటుంది. ఐదు పథకాల కోసం ప్రభుత్వం ఒకే దరఖాస్తు ఫారం అందుబాటులోకి తెచ్చింది. 4పేజీలతో కూడిన అభయ హస్తం అప్లికేషన్ ఎలా ఉంది..? అందులో ఏయే వివరాలు పొందుపరచాలో తెలుసుకుందాం.

ఫస్ట్ పేజీ

దరఖాస్తు పత్రంలోని మొదటి పేజీలో పేరు, లింగ నిర్థారణ, కులం వివరాలు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు నింపాల్సి ఉంటుంది.




సెకండ్ పేజీ

దరఖాస్తు చేసుకునే వ్యక్తి పూర్తి చిరునామా రాయాల్సి ఉంటుంది. అందులో ఇంటి నెంబర్, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, వార్డు నెంబర్, మండలం, జిల్లా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత పథకాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. దరఖాస్తుదారులు ఏ స్కీం కింద లబ్ది పొందాలనుకుంటున్నారో దాని ఎదుట టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది.




మహాలక్ష్మి స్కీం :

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్థికసాయం, సబ్సిటీ గ్యాస్ సిలిండర్ కోసం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అవసరమా లేదా అనే కాలమ్ ఉంటుంది.

సబ్సిడీ సిలిండర్ స్కీం :

500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎదుట టిక్ మార్క్ పెట్టాలి. ఆ తర్వాత

గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య పొందుపరచాలి

రైతు భరోసా పథకం :

దరఖాస్తుదారుడు రైతా లేక కౌలు రైతా అనే వివరాలు ఇవ్వాలి. పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణంతో నమోదు చేయాలి.

అదే విధంగా వ్యవసాయ కూలీలకు ఏటా ఇచ్చే రూ. 12 వేల కోసం ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల పథకం :

ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తారు.

దరఖాస్తుదారులు ఏ కేటగిరీ కింద లబ్ది పొందాలనుకుంటున్నారో టిక్ చేయాలి.

అమరవీరులు, ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం వివరాలు నమోదు చేయాలి.

అమరవీరుల పేరు, అమరలైన సంవత్సరం.. ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్ రాయాలి.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఎఫ్ఐఆర్ నెంబర్.. ఒక వేళ జైలుకు వెళ్లినట్లైతే జైలు పేరు, స్థలం, శిక్షా కాలం వివరాలు పొందుపరచాలి.

థర్డ్ పేజీ

గృహ జ్యోతి పథకం :

ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలనెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు.

దరఖాస్తుదారుల నెలవారీ సగటు గృహ విద్యుత్ వినియోగం గురించి వివరాలు తెలియజేయాలి. అదే విధంగా కరెంట్ మీటర్ కనెక్షన్ సంఖ్య నమోదు చేయాలి.

చేయూత పథకం :

చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేలు, దివ్యాంగుల పింఛన్ 6 వేలు పొందేందుకు ఈ కింద వివరాలను పూరించాలి. ప్రస్తుతం ఫించన్ పొందుతున్న వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ నెంబర్ పొందుపరచాలి. ఇతరులు వృద్యాప్య , వింతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టెకేదార్ జీవన భృతిలో ఏ కేటగిరీ కింద దరఖాస్తు చేస్తున్నారో ఆ వివరాలు నమోదు చేయాలి.




ఫోర్త్ పేజీ

అధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాలి.

దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధ్రువీకరించాలి. ఆ తర్వాత సంతకం లేదా వేలిముద్ర వేయాలి. దాని కింద పేరు, తేదీ నింపి సంబంధిత అధికారులకు అందజేయాలి.

అధికారులు దరఖాస్తు పరిశీలించి ప్రజా పాలన దరఖాస్తు రశీదు ఇస్తారు.








Updated : 27 Dec 2023 9:07 PM IST
Tags:    
Next Story
Share it
Top