వాళ్లతో రేవంత్కు వెన్నుపోటు ప్రమాదం ఉంది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
X
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వెన్నుపోటు ప్రమాదం ఉందని అన్నారు. ఆయన సొంత పార్టీలోని ఓ నలుగురు ఆయనను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని సెన్సేషనల్ కామెట్స్ చేశారు. గతంలో ఎన్టీఆర్ ను ఎలాగైతే కొందరూ వెన్నుపోటు పొడిచారో కాంగ్రెస్ లో కూడా కొందరూ రేవంత్ ను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పక్క పార్టీలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దాని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారని, అలా చేస్తే పార్టీ కార్యకర్తలు వాళ్ల ఇళ్లను తగలబెడుతారని అన్నారు. రేవంత్ ను మోసం చేయానుకునే నాయకులను తాను ఉపేక్షించబోనని, వాళ్లను పైకి పంపుతానంటూ కేఏ పాల్ హెచ్చరించారు.
కాగా ఇటీవల కేఏ పాల్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాను కలిసేందుకు వెళ్లానని కేఏ పాల్ చెప్పారు. జనవరి 30 నిర్వహించనున్న ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ ను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అప్పుడు తెలిపారు. సదస్సుకు కావాల్సిన అనుమతుల మంజూరు చేయాల్సిందిగా కోరానని అన్నారు. అలాగే క్రిస్టియన్ల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లానని, వాటిని పరిష్కరిస్తానని రేవంత్ తనకు హామీ ఇచ్చారని కేఏ పాల్ తెలిపారు.