ప్రజా దర్బార్ పేరుతో దగా చేశారు.. కడియం శ్రీహరి
X
ప్రజా దర్బార్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దగా చేసిందని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ పేరుతో అట్టహాసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి మాత్రమే హాజరయ్యారని, ఆ తర్వాత దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అంతా ఆశపడ్డారని, కానీ అలా జరగడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలు పెంచుతారని అంతా అనుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పథకాలను రద్దు చేస్తోందని అన్నారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి అనుమతి పత్రాలను కూడా అందించిందని... కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం రద్దు వల్ల చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. దళితబంధుకు కూడా నిధులు ఆపి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై కడియం శ్రీహరి మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా కాలాయాపన చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. ఫార్మా సిటీ రద్దు ప్రకటనతో భూముల ధరలు పడిపోయాయన్నారు. మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. నమ్మి ఓటు వేసిన యువతకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు అండగా ఉండేందుకు సిద్ధమయ్యారని, బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.