రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలి.. కడియం శ్రీహరి
X
మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియాతో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నం చేయదని స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తమకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశమిచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గడువులోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున ఎండగడుతామని హెచ్చరించారు.
అలాగే గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని ఆపొద్దని కోరారు. దళిత బంధును ఆపడం వల్ల అనేక మంది దళితులు అన్యాయానికి గురవుతారని అన్నారు. దళిత బంధులో అక్రమాలకు పాల్పడినవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కూడా కొనసాగించాలని కడియం శ్రీహరి కోరారు.