గిరిజనుల అభివృద్ధికి కొత్త స్కీమ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X
దేశంలోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాల ఏర్పాటు దిశగా పీఎం జన్ మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం చైతన్య నగర్ లో నిర్వహించిన జన్ మన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను తీసుకొచ్చిందని తెలిపారు.
ఈ స్కీమ్ కోసం కేంద్రం ఇప్పటికే రూ.25 వేల కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఆదివాసీలకు ఇండ్లు, రేషన్ కార్డు, విద్యుత్ సౌకర్యం, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఆరోగ్య భద్రత వంటి పలు కార్యక్రమాలకు ఈ నిధులు ఖర్చుపెట్టనున్నట్లు తెలిపారు. ఇక జిల్లాలోని అనంతగిరి ప్రాంతానికి రూ.100 కోట్ల నిధులతో పర్యాటక అభివృద్ది కోసం కేటాయిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కాగా నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఏపీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ప్రధానమంత్రి వర్చువల్ పద్దతిలో చెంచులతో మాట్లాడేందుకు సమావేశం నిర్వహించారు. పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా చెంచులతో వర్చువల్ పద్దతి ద్వారా ప్రధానమంత్రి మాట్లాడారు. వారి జీవన స్థితిగతుల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.