ముగిసిన ధరణి కమిటీ సమావేశం
X
ధరణిపై రివ్యూ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి చైర్మన్ గా ఉన్నారు. ఇక ధరణి కమిటీకి సంబంధించిన తొలి సమావేశం ఇవాళ జరిగింది. ధరణిలోని సమస్యలు, సవరణలపైఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆదరాబాదరగా ధరణి తేవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తయాని అన్నారు. ధరణితో ఎంతో మంది రైతులు తమ హక్కులను కోల్పోయారని అన్నారు. ధరణి వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రైతుల ప్రాణాలు పోయాయని అన్నారు. తహసీల్దార్ ను సజీవ దహనం చేసిన ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్ష చేశారని, సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని అన్నారు. ధరణి పోర్టల్ పై ప్రధానంగా చర్చించామని అన్నారు. గత తప్పలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సీసీఎల్ తరహాలో ధరణి ఆఫీస్ ను ఏర్పాటు చేసి.. సిబ్బందిని నియమించుకుంటామని తెలిపారు. రైతులకు సంబంధించి అన్ని సమస్యలపై చర్చించి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. తమ రెండో సమావేశం సమయానికి ధరణికి సంబంధించిన అన్ని విషయాలు చెబుతామని అన్నారు. కాగా ధరణి పోర్టల్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనం , పునర్నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. సీసీఎల్ఏ కన్వీనర్‌గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం.సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్ ఉన్నారు. పరిస్ధితులు, అవసరాన్ని బట్టి కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులను సభ్యులుగా చేర్చుకోవచ్చని ప్రభుత్వం జీవోలో తెలిపింది.