KTR : మైనార్టీలను కాంగ్రెస్ మోసం చేసింది.. కేటీఆర్
X
మైనార్టీలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలపై పగ పట్టిందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని కేటీఆర్ అన్నారు. దేశంలోని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితికి మద్దతు అందించారని అందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనార్టీలకు రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. 1953 తర్వాత తొలిసారి రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరు గెలవలేరు అన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని, మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చన్న విషయం కాంగ్రెస్ కావాలనే మరిచిపోయిందన్నారు.
మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాల కన్నా ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసి పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పోటీ పడుతుందన్నారు. ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ పేరు వాడుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేవలం సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మైనార్టీలకు మంత్రి పదవికాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వడం అంటే మైనార్టీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమేనని అన్నారు. రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమంపైన సమీక్ష నిర్వహించలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని, ముస్లిం కోటాను పెంచడం, 4000 కోట్ల రూపాయల బడ్జెట్ ను మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాల పైన తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి లబ్ధి చేకూర్చేలా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే మాదిరిగా బీజేపీకి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ లు అనేక ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పని చేశాయని విమర్శించిన కేటీఆర్, రానున్న ఎన్నికల కోసం ఇదే తీరుగా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని కోరారు.