Home > తెలంగాణ > జర్నలిస్ట్ శంకర్ దాడి వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డే..కేటీఆర్

జర్నలిస్ట్ శంకర్ దాడి వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డే..కేటీఆర్

జర్నలిస్ట్ శంకర్ దాడి వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డే..కేటీఆర్
X

జర్నలిస్ట్ శంకర్ హత్యాయత్నం వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డినే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శంకర్ పై దాడికి సీఎం రేవంత్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఆదివారం రాత్రి జర్నలిస్ట్ శంకర్ ను తుర్కయంజాల్ లోని ఆయన నివాసంలో కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ లో రైతులకు సంబంధించిన భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకువచ్చినందుకే జర్నలిస్టు శంకర్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. నిజాలను నిర్భయంగా బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న శంకర్ పైన, రాజ్యాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకొని అంతమొందించాలని ప్రయత్నించారని, కానీ ఈ ప్రభుత్వ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైందన్నారు. శంకర్ పైన పకడ్బందీగా గత కొద్ది రోజులుగా రెక్కి నిర్వహించి మరీ పదుల సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ గుండాలు ఆయనను అంతమొందించే ప్రయత్నం చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికులు, సీసీ కెమెరాల సాక్ష్యంగా ఉండడంతో వారి కుట్ర ఫలించలేదన్నారు. భవిష్యత్తులో శంకర్ పై దాడులకు తెగబడితే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.

శంకర్ ను అంతమొందించేందుకు భౌతికంగా దాడి చేసినా, స్థానిక పోలీసులు హాత్యాయత్నం కేసు నమోదు చేయకుండా అలసత్వం, పక్షపాతం చూపించారన్నారు. పోలీసుల పక్షపాత వైఖరిపైన ప్రధాన ప్రతిపక్షంగా అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టు శంకర్ పైన ఎట్లాంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యులు రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో నాటి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా.. ఏనాడు తాము భౌతిక దాడులకు పాల్పడలేదని అన్నారు. జర్నలిస్టు శంకర్ పై దాడి జరిగితే జర్నలిస్టు సంఘాలు మౌనంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. నేడు శంకర్ కి పట్టిన గతే రేపు మిగతా జర్నలిస్టులకు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. అందుకే జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఈ విషయంపై స్పందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఆయనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని కేటీఆర్ అన్నారు.



Updated : 25 Feb 2024 4:06 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top