బాలుడి వైద్యానికి కేటీఆర్ ఆర్థిక సాయం
X
అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ పేద బాలుడి వైద్యానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందజేశారు. బాలుడి కుటుంబానికి వైద్యం నిమిత్తం లక్ష రూపాయలు అందజేశారు. ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీకి చెందిన కే.శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్యతో ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డ సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎన్నో కష్టాలు పడి బాలుడికి ఆపరేషన్ కూడా చేయించారు. కానీ దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.
మరోసారి చికిత్స కోసం ఆస్పత్రిలో సంప్రదిస్తే ఆపరేషన్ కోసం ఏడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో ప్రదీప్ కుటుంబం అవేదనకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న నాటి మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని అపరేషన్ కు అవసరమైన రూ. 6 లక్షల సహాయాన్ని ఈఎస్ఐ ద్వారా సాయం చేశారు. అయితే రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి మిగిలిన లక్ష రూపాయలు కూడా జమ చేయడం కష్టంగా మారింది. ఈ సమస్య తెలుసుకున్న బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు విషయాన్ని కేటీఆర్,మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో నేడు మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తరువాత మల్లారెడ్డితో కలిసి బాధితుడి ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ కుమారుడి ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్, మల్లారెడ్డిలకు ప్రదీప్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.