అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్
X
కొత్త సంవత్సరం సందర్భంగా తన ఇంట్లో భోజనం చేయాలన్న ఓ అభిమాని కోరికను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీర్చారు. ఈ సందర్భంగా బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి ఆదివారం కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కి తన ట్వీట్ లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని అయితే ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కి తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీం ఖాన్ శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ త్వరలోనే ఇంటికి వస్తానని మాట ఇచ్చారు.
ఇబ్రహీంఖాన్ కు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కేటీఆర్ బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్ కు ఇబ్రహీం ఖాన్ సాదరంగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఇబ్రహీం ఖాన్ బిర్యానీ వడ్డించారు. ఈ సందర్భంగా దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పించన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్ కి ఇబ్రహీం ఖాన్ కుటుంబం తెలియజేసింది.
ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు ఉన్న మూగ చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు. కేటీఆర్ బోరబండకి రావడంతో వందల మంది ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇబ్రహీంఖాన్ ఇంటి వద్ద గుమికూడారు.