6 నెలల్లో కాంగ్రెస్పై ప్రజలు తిరగబడతారు.. కేటీఆర్
X
6 నెలల్లో కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడతారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ రుణమాఫీని దశలవారీగా చేస్తామని ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగంలా ఉండేనని, కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ క్యూలైన్ లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయని అన్నారు. రైతు బంధు డబ్బులను ఇప్పటి వరకు పూర్తిగా ఇవ్వలేదని, రైతులంటే ఈ ప్రభుత్వానికి శ్రద్ధలేదని అన్నారు. రైతు బంధు డబ్బును అందరికీ ఎప్పటి వరకు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపు అమలు చేస్తుందనే నమ్మకం ప్రజల్లో లేదని, గడువులోగా ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని అన్నారు.
ఏవేవో హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడూ గుర్తు చేస్తుండాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు ఆస్తులను సృష్టించిందన్న కేటీఆర్.. బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్ కు అప్పగించామని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్లు అంతా తమదేనని బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారని, అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయని కేటీఆర్ అన్నారు. పంచాయతీ, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.