రేపు బీఆర్ఎస్ 'స్వేద పత్రం'.. కేటీఆర్
X
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 'స్వేద పత్రం' రిలీజ్ చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో రేపు ఉదయం 11 గంటలకు 'స్వేద పత్రం' రిలీజ్ కార్యక్రమం ఉంటుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. తెలంగాణకు సంబంధించి గత తొమ్మిదిన్నరేళ్లు ఓ సువర్ణ అధ్యాయం అని అన్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించబోమని, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని అన్నారు.
అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు 'స్వేద పత్రం'పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కాగా ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనపై అసెంబ్లీలో రెండు శ్వేత పత్రాలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మొదటిది బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల గురించి కాగా.. రెండోది విద్యుత్ శాఖకు సంబంధించినది. ఇక ఈ రెండు శ్వేత పత్రాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో రిలీజ్ చేశారు.