500 కార్లతో బయలుదేరిన భట్టి విక్రమార్క సతీమణి నందిని
X
రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు పార్టీ నేతల నుంచి కాంగ్రెస్ నాయకత్వం దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఖమ్మం ఎంపీ స్థానానికి దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని భారీ కాన్వాయ్ మధ్య ఖమ్మం నుంచి బయలుదేరారు. మొత్తం 500 కార్లతో ఆమె ఖమ్మం నుంచి హైదరాబాద్ లోని గాంధీభవన్ కు బయలు దేరారు. ఈ క్రమంలోనే ఖమ్మం ఎంపీ సీటు కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక గాంధీ పోటీ చేయాలని టీపీసీసీ నుంచి కోరారని, ఆ ఇద్దరిలో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటామని నందిని అన్నారు.
ఒకవేళ వాళ్లు కాదంటే తాను ఖమ్మం నుంచి పోటీ చేస్తానని, అందుకు పార్టీ అధిష్టానం అవకాశం ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా చేస్తానని అన్నారు. కాగా ఎంపీ సీట్లకు దరఖాస్తు పెట్టుకోవడానికి ఇవాళ చివరి తేదీ కావడంతో ఆశావహులతో గాంధీభవన్ కిటకిటలాడుతోంది. గడిచిన మూడు రోజులుగా దరఖాస్తు చేసుకున్న వారిలో.. ఎక్కువగా మంత్రుల భార్యలు, ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, సినీ ప్రముఖులు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు పెరిగినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.