Home > తెలంగాణ > ఉచిత ప్రయాణ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

ఉచిత ప్రయాణ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

ఉచిత ప్రయాణ పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
X

'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్య' పథకం అమలు తీరుపై హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పథకం అమలవుతున్న తీరును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీంను విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. సంక్రాంతి పర్వదినంలోనూ మహాలక్ష్మి స్కీంను అమలు చేస్తూ క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారని కొనియాడారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా త్వరలో మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం తరపున సహాయసహకారాలు సంస్థకు ఉంటాయని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు చేయడం వెనుక క్షేత్రస్థాయి సిబ్బంది డ్రైవర్, కండక్టర్ల కృషి ఉందని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సందర్బంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని ఆయనను కోరారు. సిబ్బంది పెండింగ్ సమస్యల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.




Updated : 19 Jan 2024 4:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top