Home > తెలంగాణ > మా ప్రభుత్వాన్ని టచ్ చేసే దమ్ము ఎవడికీ లేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్

మా ప్రభుత్వాన్ని టచ్ చేసే దమ్ము ఎవడికీ లేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్

మా ప్రభుత్వాన్ని టచ్ చేసే దమ్ము ఎవడికీ లేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్
X

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని టచ్ చేసే దమ్ము ఎవడికీ లేదని అన్నారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారంలోని సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వనదేవతలకు తన నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేడారం అమ్మవార్ల దీవెనలతో తమ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండబోదంటూ కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 70 రోజులు కూడా కాలేదని, అప్పుడే తమ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తమ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు.

కాగా ఇటీవల తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల పెంపు, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అదే విధంగా ఈ నెలాఖరు వరకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక వీటితో పాటు ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు నెలకి రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పెంపు తదితర హామీలను 100 రోజుల్లో అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే హామీల అమలుకు కావాల్సిన నిధుల సమీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం నుంచి తమకు వాటాకు రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించారు.


Updated : 22 Feb 2024 12:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top