చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మళ్లీ బీఆర్ఎస్దే విజయం.. ఎంపీ రంజిత్ రెడ్డి
X
చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మళ్లీ బీఆర్ఎస్ దే విజయమని అక్కడి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఎంపీ డా.రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న పార్లమెoట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ గడ్డ మీద బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ సూచించినట్లు తెలిపారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి 98 వేల ఓట్ల లీడ్ వచ్చిందని రంజిత్ రెడ్డి తెలిపారు. అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లో కూడా ఈజీగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ వెళ్తామని, లక్ష ఓట్ల మెజారిటీతో చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని అన్నారు. ఈ రివ్యూలో కేటీఆర్, రంజిత్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.