Home > తెలంగాణ > పద్మశ్రీ పురస్కార గ్రహీతకు యువ ఎమ్మెల్యే సన్మానం

పద్మశ్రీ పురస్కార గ్రహీతకు యువ ఎమ్మెల్యే సన్మానం

పద్మశ్రీ పురస్కార గ్రహీతకు యువ ఎమ్మెల్యే సన్మానం
X

పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉందన్నారు. సమ్మయ్య తన కళతో పాలకుర్తి ప్రాంతానికే కాకుండా రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. గ్రామీణ కళలను ప్రోత్సహించడానికి పాలకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

కాగా.. కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యది నిరుపేద కుటుంబం. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తండ్రి రామస్వామి నుంచి యక్షగాన కళను వారసత్వంగా పొందిన సమ్మయ్య.. 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ కళను ప్రదర్శిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో దాదాపు 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. పౌరాణిక కథలతోపాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ఆకట్టుకున్నారు. చిందుయక్ష కళాకారుల సంఘం, గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం వంటివి స్థాపించి కళను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.



Updated : 26 Jan 2024 4:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top