ఏకపక్షంగా బిల్లులను పాస్ చేయడం కరెక్ట్ కాదు.. ప్రొ.కోదండరామ్
X
విపక్షాలు లేకుండా ఏకపక్షంగా బిల్లులను ఆమోదింపజేసుకోవడం సరికాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. లోక్ సభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ b కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరామ్.. పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చించేందుకు ప్రయత్నించిన 150 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. విపక్ష ఎంపీలను బయటకు పంపి బిల్లులను పాస్ చేయడం ప్రజాస్వామ్యానికి ఓ మచ్చ అని అన్నారు. ముఖ్యమైన బిల్లులను విపక్షాలు లేకుండా ఆమోదించుకోవడం సరికాదని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటమే పార్లమెంట్ సమావేశాల ముఖ్య ఉద్దేశమన్న ఆయన.. విపక్షాలకు చెందిన ఎంపీలను ప్రజల తరఫున మాట్లాడనీయకుండా చేయడం కరెక్ట్ కాదన్నారు. విపక్షాలను మొత్తం బయటకు పంపడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. ఈ విషయంపై ప్రపంచ మీడియా భారత్ ను చులకనగా చూస్తోందని అన్నారు. విపక్ష సభ్యులకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.