Home > తెలంగాణ > 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం

11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం

11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల ప్రయాణం
X

మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈ స్కీంను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది. సమర్థవంతంగా ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు ఈ నెల 15 నుంచి జీరో టికెట్లను మహిళలకు జారీ చేస్తోంది. 6 గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి మహిళల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య అమలు తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. దాదాపు 30 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లతో స్వయంగా మాట్లాడారు. ఈ స్కీం అమలవుతున్న తీరు, వారికి తలెత్తుతున్న ఇబ్బందులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.

ఇక పథకం అమలవుతున్న తీరుపై సజ్జనార్ మీడియాకు వివరించారు. 11 రోజుల్లో మొత్తం 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఈ 11 రోజుల్లో ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల్లో 62 శాతం మహిళలే అని ఆయన తెలిపారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని, పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతి రోజూ 51 లక్షల మందిని ఆర్టీసీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తోందని అన్నారు. మహిళల ఉచిత ప్రయాణ స్కీం ఫలితంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగిందన్నారు. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా.. ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగిందన్నారు. ఈ నెల 16వ తేదిన 17 డిపోలు, 17వ తేదిన 20 డిపోలు, 18వ తేదిన 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయిందన్నారు. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయని సజ్జనార్ తెలిపారు. మహిళా ప్రయాణికులు ప్రభుత్వం గుర్తించిన ఏదైన ఒరిజినల్ ఐడీ కార్డును కండక్టర్ కు చూపించాలని, లేకుంటే జరిమానా విధిస్తామని అన్నారు.

త్వరలో 2050 కొత్త బస్సులు

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2,050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అందులో 1,050 డీజిల్.. 1,000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయని సజ్జనార్ తెలిపారు.

Updated : 20 Dec 2023 5:37 PM IST
Tags:    
Next Story
Share it
Top