ఆ వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
X
రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 85 శాతం ఉన్నారని, వారి అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి)గా నియామకం అయిన తర్వాత మొదటిసారి షబ్బీర్ అలీ గాంధీ భవన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 85 శాతం ఉన్నారని .. ఈ నాలుగు కులాల దగ్గరకి ఎలా పోవాలి అన్న అంశాలపై చర్చించామని అన్నారు.ఈ తరగతులను అభివృద్ధి చేయడం మా భాద్యత అని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను ఖచ్చితం గా అమలు చేసే పనిలో ఉన్నామని , రేపు ఎల్లుండి ఛార్జ్ తీసుకున్న తర్వాత వివిధ శాఖల కార్యదర్శులని పిలిచి మాట్లాడుతానని అన్నారు. ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా నెరవేర్చాలి అనే విషయాలపై చర్చించినట్లు తెలిపారు.
100 రోజుల్లో 6 గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఇక బడ్జెట్ లో తమ శాఖకు సంబంధించి ఏమేం పెట్టాలని చర్చించినట్లు వెల్లడించారు. అభయహస్తం ఆరు గ్యారెంటీల గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటి అమలు సాధ్యకాదంటూ తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటి పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. అర్హులను గుర్తించి ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామని తెలిపారు. అది కూడా తాము ఇచ్చిన గడువులోపేనని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.