కేటీఆర్ను కలిసిన శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ.. ఎందుకోసమంటే?
X
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురువారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఓ వైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలై రాజకీయం వేడెక్కిన ఈ క్రమంలో కేటీఆర్ ను శంకరమ్మ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేటీఆర్ తో శంకరమ్మ భేటీలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, తన మనవడి పుట్టిన రోజు వేడుకకు రావాలని శంకరమ్మ కేటీఆర్ ను ఆహ్వానించారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాగా శంకరమ్మ ఈ నెల 3న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎన్నికల సమయంలో అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో శంకరమ్మ సీఎం రేవంత్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి గానీ లేక ఏదైనా నామినేటెడ్ పదవి గానీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కృత నిశ్చయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా శంకరమ్మ కేటీఆర్ ను కలవడం రాజకీయంగా అనేక ప్రచారాలకు తెరతీసింది.