సీఎం రేవంత్ను కలిసిన శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ
X
శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను రేవంత్ కు శంకరమ్మ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడైన శ్రీకాంతా చారి గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శంకరమ్మ తన కొడుకు శ్రీకాంతా చారిని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సీఎం ఆమెను ఓదార్చారు. తమ ప్రభుత్వంలో అమరుల కుటుంబాలకు తగిన ప్రాధ్యాన్యం ఉంటుందని చెప్పారు.
ఇక సీఎం రేవంత్ ను కలిసిన నేపథ్యంలో శంకరమ్మకు నామినేటెడ్ పదవి లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. కాగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వారికి ప్లాట్లు ఇవ్వడం మాత్రమే కాక.. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.