Revanth Reddy' : రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారు
X
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల ఆయన స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ కు వెళ్లనున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. తెలంగాణ ఇప్పటికే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా, ఆ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో మన దేశంలోని కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. గత పదేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. చాలా కంపెనీలు నగరంలో కార్యాలయాలు ప్రారంభించి భారీగా పెట్టుబడులు పెట్టాయి. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.