ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
X
పీఎస్‌ఎల్‌వీ-సీ58 శాటిలైట్ ను విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఇస్రో సైంటిస్టులు తమ ప్రయోగంతో దేశ ప్రజలను గర్వపడేలా చేశారని కొనియాడారు. అలాగే ఇస్రో శాస్త్రవేత్తకు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బ్లాక్ విశ్వం ఆవిర్భావ రహస్యాన్ని తెలుసుకునేందుకు బ్లాక్ హోల్స్ అధ్యయనం కోసం శాటిలైట్ ను పంపిన రెండో దేశం భారత్ అని అన్నారు. ఇంతకు ముందు ఈ ఘనతను అమెరికా సాధించిందని తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. కాగా 2024ను ఇస్రో గ్రాండ్ గా ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇవాళ పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహక నౌకను ప్రయోగించింది. షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహక నౌక ‘ఎక్స్-రే 480 కిలోల పొలారిమీటర్ ఉపగ్రహం’తో ఉదయం 9:10 గంటలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగాన్ని చేపట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లని చెప్పారు.