ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
X
వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కాబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీ పీసీసీకి కాబోయే చీఫ్ వైఎస్ షర్మిలనే అని స్పష్టం చేశారు. తెలంగాణలో తాను సీఎంగా పగ్గాలు చేపట్టి 30 రోజులు అవుతున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన షర్మిల ఉదంతంపై రేవంత్ మాట్లాడారు. తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరుతూ షర్మిల తనను కలిశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలుగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలనే విషయాలపై చర్చించామని తెలిపారు. ఈ క్రమంలోనే తాను తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉన్నానని, అలాగే షర్మిల ఏపీకీ కాబోయే కాంగ్రెస్ అధ్యక్షురాలు అని అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా ఈ నెల 4న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్, ఖర్గేసహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం తనకు ఏ పదవి ఇచ్చిన పని చేస్తానని షర్మిల అన్నారు. అయితే ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పే ఛాన్స్ ఉందని, రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.