పాత రేషన్ కార్డుల రద్దు?
X
ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. భోగస్ కార్డుల ఏరివేతపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించారు. కార్డు ఉండీ కొన్నేళ్లుగా సరకులు తీసుకోని వారిపై దృష్టి సారించారు. ప్రత్యేక సాప్ట్‌వేర్ సహాయంతో జిల్లాల వారీగా ఇప్పటి వరకు సరుకులు పొందని వారి రేషన్ కార్డుదారులను గుర్తించారు. సరుకులు తీసుకెళ్లని వారిని తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. బోగస్ కార్డుల తొలగింపుతో పాటు కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
దరఖాస్తులపై అందని మార్గదర్శకాలు
రాష్ట్రంలో కొత ్త ప్రభుత్వం ఏర్పాటుతో ఆహారభద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పక్షం రోజుల పాటు గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీల్లో మరికొన్నింటిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉంటుందని భావిస్తుండగా గతంలో చేసిన దరఖాస్తులు పని చేస్తాయా..? లేదా కొత్తగా ఆర్జీ పెట్టుకోవాలా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు.