ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా!
X
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షణ భాగం(చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షణ భాగాన్నిజాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి , పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ అందజేశారు.
ఆయా రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఏ ఏ అంశాలపై చర్చించారంటే?
తొలుత రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్తరన్ పార్ట్ చౌటుప్పల్-భువనగిరి-తుఫ్రాన్-సంగారెడ్డి-కంది పరిధిలో యుటిలిటీస్ (కరెంటు స్తంభాలు, భవనాల తదితరాలు) తొలగింపునకు సంబంధించి వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబనపై చర్చసాగింది. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పది నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలపకపోవడంతో ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించేందుకు సమ్మతిస్తూ ఎన్‌హెచ్ఏఐకు లేఖ పంపారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ అంశంపై ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టిందెవరంటూ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్‌లో టోల్ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు.
యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని తామే భరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించి భూ సేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని రేవంత్ కు కేంద్ర మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా, హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. రేవంత్ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి సూచించారు.
నేషనల్ హైవేస్ గా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ కోరింది వీటినే..
1.మరికల్-నారాయణపేట్-రామసముద్ర-63 కి.మీ.
2.పెద్దపల్లి-కాటారం-66 కి.మీ
3.పుల్లూర్-అలంపూర్-జటప్రోలు-పెంట్లవెల్లి-కొల్లాపూర్-లింగాల్-అచ్చంపేట-డిండి-దేవరకొండ-మల్లేపల్లి-నల్గొండ-225 కి.మీ.
4.వనపర్తి-కొత్తకోట-గద్వాల-మంత్రాలయం-110 కి.మీ.
5.మన్నెగూడ-వికారాబాద్-తాండూర్-జహీరాబాద్-బీదర్-134 కి.మీ.
6.కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం-165 కి.మీ.
7.ఎర్రవెల్లి క్రాస్ రోడ్-గద్వాల-రాయచూర్-67 కి.మీ.
8.జగిత్యాల-పెద్దపల్లి-కాల్వ శ్రీరాంపూర్-కిష్టంపేట-కల్వపల్లి-మోరంచపల్లి-రామప్ప దేవాలయం-జంగాలపల్లి-164 కి.మీ
9.సారపాక-ఏటూరునాగారం-93 కి.మీ
10.దుద్దెడ-కొమురవెల్లి-యాదగిరిగుట్ట-రాయగిరి క్రాస్‌రోడ్-63 కి.మీ.
11.జగ్గయ్యపేట-వైరా-కొత్తగూడెం-100 కి.మీ.
12.సిరిసిల్ల-వేములవాడ-కోరుట్ల-65 కి.మీ
13.భూత్పూర్-నాగర్‌కర్నూల్-మన్ననూర్-మద్దిమడుగు (తెలంగాణ)-గంగలకుంట-సిరిగిరిపాడు-166 కి.మీ.
14.కరీంనగర్-రాయపట్నం-60 కి.మీ