Kumari Aunty : కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగుల నిరసన
X
మాదాపూర్ లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎదుట నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఇటీవల సోషల్ మీడియాలో తన ఫుడ్ స్టాల్ ద్వారా ఫేమస్ అయిన కుమారి అనే మహిళను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కలుస్తా అని మాట ఇచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగుల నిరసనకు దిగారు. నిరుద్యోగుల ఆందోళనతో కుమారి ఆంటీ కన్నీరు పెట్టుకున్నారు. తనకు ఇక్కడ ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదంటూ వాపోయారు. తాను ఎంతో కష్టపడి ఫుడ్ స్టాల్ నడుపుకుంటున్నానని, దయచేసి తనను ఇబ్బందిపెట్టవద్దని కుమారి ఆంటీ నిరుద్యోగులను కోరారు.
కాగా కుమారి ఆంటీ అంటే బహుశా హైదరాబాద్ లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఫుట్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తరలివస్తుంటారు ఫుడ్ లవర్స్. అయితే ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఆమెను షాపును అక్కడి నుంచి తొలగించారు. దీంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓ పేద మహిళ కష్టపడి షాపు నడుపుకుంటుంటే ఎలా తొలగిస్తారంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈనేపథ్యంలోనే ఆమె షాపును తిరిగి అక్కడే ఉంచేటట్లు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని తెలిపారు. దీంతో ఆమె మరింత ఫేమస్ అయింది.