ఇంటి గోడపై నిద్రపోయిన పులి.. రాత్రంతా గ్రామస్తుల జాగారం
X
పెద్ద పులి పేరు వింటేనే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. మరీ అలాంటి పులి మన ఇళ్లల్లోకి వస్తే.. వచ్చి మన ఇంటి గోడపై నిద్రపోతే.. అని ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా. అయితే ఓ పెద్ద పులి నిజంగానే ఓ గ్రామంలోకి ప్రవేశించి ఓ ఇంటి గోడపై రాత్రంతా నిద్రపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు భయంతో హడలిపోయారు. భయంతో రాత్రంతా జాగారం ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా అట్కోనా గ్రామంలోకి ఓ పులి దారి తప్పి రాత్రి వేళ ప్రవేశించింది. పులిని చూసిన వీధి కుక్కలు మొరగడం ప్రారంభించడంతో గ్రామస్థులంతా మొదట దొంగలేమోనని అనుకున్నారు. కానీ తీరా కుక్కలు మొరిగే ప్రదేశానికి వెళ్లి చూడగా వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఓ ఇంటి గోడపైకి ఎక్కి ఓ పులి తాపీగా నిద్రపోతుంది. ఆ పులిని చూసిన గ్రామస్తులు హడలిపోయారు. అది ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తుందోననే భయంతో ఆ ఇంటి చుట్టూ రక్షణ వలలు కట్టారు. ఇక ఆ పులిపై లైట్ వేసినా కూడా అది మాత్రం కదలకుండా అలాగే ఉండిపోయింది. ఇక గ్రామస్థులు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఈ రోజు ఉదయం వారు పులికి మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం తిరిగి అడవిలో వదిలిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.