రివ్యూ : మార్కెట్ మహాలక్ష్మి

Update: 2024-04-18 11:30 GMT

రివ్యూ : మార్కెట్ మహాలక్ష్మి

తారాగణం : పార్వతీశం, ప్రణికాన్విక, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు..

ఎడిటర్ : ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి

సినిమాటోగ్రఫీ : సురేంద్ర చిలుముల

సంగీతం : జో ఎన్మవ్

ప్రొడ్యూసర్ : అఖిలేష్ కలారు

రచన, దర్శకత్వం : వియస్ ముఖేష్

రిలీజ్ డేట్ : 19.04.2024

చాలా తక్కువ సినిమాల్లోనే హీరోయిన్ల పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ ఓరియంటెడ్ కాకపోయినా ఆమె చుట్టూనే తిరిగే కథలు అరుదు. అలాంటి సినిమానే మార్కెట్ మహాలక్ష్మి. కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా నటించిన ఈ చిత్రాన్ని విఎస్ ముఖేష్ డైరెక్ట్ చేశాడు. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం.

కథ :

మార్కెట్ లో షాప్ రన్ చేస్తూ.. కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న అమ్మాయి మహాలక్ష్మి(ప్రణికాన్విక). కాస్త డామినేటింగ్ గా ఉండే వ్యక్తిత్వం తనది. ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడు(పార్వతీశం). వెంటనే ఐ లవ్యూ అని చెబుతాడు కూడా. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా చెంప పగలగొడుతుంది మహాలక్ష్మి. ఆ ధైర్యం, తన వ్యక్తిత్వం రెండూ నచ్చి ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని.. మార్కెట్ లోనే పాగా వేస్తాడు. కానీ మహాలక్ష్మి మనసు కరగదు. చివరగా తనతో ఓ నాలుగు రోజులు గడిపితే తన ప్రేమను అర్థమయ్యేలా చేస్తా అంటాడా కుర్రాడు. ముందు నో చెప్పినా తర్వాత ఒప్పుకున్న మహాలక్ష్మి ఆ నాలుగు రోజుల్లో తనతో ప్రేమలో పడుతుంది. ఆ విషయం తనే ముందు చెబుతుంది. కానీ దాంతో పాటే ఓ కండీషన్ కూడా చెబుతుంది. ఆ కండీషన్ విన్న అబ్బాయికి షాక్ తింటాడు. అయినా తన ఇంటికి తీసుకువెళ్లి పేరెంట్స్ కు పరిచయం చేస్తే.. ఆ కుర్రాడి తండ్రి అమ్మాయిని అవమానిస్తాడు. మరి అమ్మాయి పెట్టిన కండీషన్స్ ఏంటీ, ఆమె ఇండివిడ్యూవాలిటీ స్థాయి ఏంటీ..? ఇలాంటి అమ్మాయి కోసం హీరో తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటీ.. అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ తో పాటు ఈ కథ ఏ తీరాలకు చేరిందనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

ఓ మంచి కథను చెబుతున్నప్పుడు ఎంచుకునే నేపథ్యం ఇంపార్టెంట్. ఈ విషయంలో దర్శకుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. మార్కెట్ లో పనిచేసే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. ఆమెను తొలి చూపులోనే ప్రేమించిన సాఫ్ట్ వేర్. వీరి మధ్య ప్రేమను బిల్డ్ చేయడం, పాత్రల మధ్య సంఘర్షణ, ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య ఉన్న లేయర్స్, అబ్బాయిలను కట్నాలు తెచ్చే సోర్స్ గా చూసే కొందరు పేరెంట్స్ కోణం, సమాజం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, నాగరికత అంశాలు.. ఇలా చాలా అంశాలను సెకండ్ హాఫ్ లో బాగా రాసుకున్నాడు దర్శకుడు. వీటిని జస్టిఫై చేసే ప్రయత్నంలో మాగ్జిమం సక్సస్ అయ్యాడు. ముఖ్యంగా హర్ష వర్ధన్ పాత్ర ద్వారా ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాని ఓ పాయింట్ ను చాలా కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశాలు బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ కాస్త యావరేజ్ అనిపించినా.. చివరి 40 నిమిషాలు ఓ అర్థవంతమైన సినిమాగా కనిపిస్తుంది. ఇలాంటి మీనింగ్ ఫుల్ మూవీస్ కోసం కొంత లాగ్ ను భరించినా ఇబ్బందేం ఉండదు అనుకోవచ్చు. మార్కెట్ లో వచ్చే సన్నివేశాలు కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ అనిపించినా.. అవన్నీ లెంగ్త్ కోసం రాసుకున్నవిగా కనిపిస్తాయి. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ సెకండ్ హాఫ్ తర్వాతే స్టార్ట్ అవుతుంది. అవే సినిమాకు హైలెట్. ఈ మధ్య కాలంలో వస్తోన్న చిన్న సినిమాల్లో పెద్ద కోణాన్ని తీసుకున్న కథ ఇదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాంటి పాయింట్ ను కన్విన్సింగ్ గా చెప్పాలనుకున్నా.. మేల్ డామినేషన్, మేల్ ఈగో యాక్సెప్ట్ చేయదు. ప్రేమికులుగా ఎన్ని త్యాగాలు చేసినా.. మళ్లీ సంప్రదాయాల మాటునే సగటు మగ దురహంకారాన్నే ప్రదర్శిస్తాం అనే పాయింట్ ను గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

నటన పరంగా..

పార్వతీశం బాగా నటించాడు. ఖచ్చితంగా అతనికి కెరీర్ లో ఇదో మెమరబుల్ రోల్ అవుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో తండ్రితో వాదించే సన్నివేశాల్లో బొమ్మరిల్లులో సిద్ధార్థ్ ను తలపించాడు. అలాగని బొమ్మరిల్లు లాంటి డైలాగ్స్ ఉండవు అక్కడ. సినిమా అంతా హీరోయిన్ పాత్ర చుట్టే తిరుగుతున్నప్పుడు.. టైటిల్ రోలే తనది అయినప్పుడు ఓ మంచి ఛాయిస్ తీసుకుంటే బావుండేది అనిపిస్తుంది. మహాలక్ష్మి పాత్రలో ప్రణికాన్విక అస్సలు సూట్ కాలేదు. ఆ క్యారెక్టర్ లోని డెప్త్ ను తను ప్రెజెంట్ చేయలేకపోయింది. చూడ్డానికి కూడా ఏమంత అట్రాక్టివ్ గా లేదు అనే చెప్పాలి. సినిమాకు సంబంధించి హీరోయిన్ మైనస్ అవుతుందేమో. తాగుబోతుగా బాషా, ఫ్రెండ్ గా అవినాష్, ఫాదర్ గా కేదారనాథ్ తో పాటు ఇతర పాత్రలన్నీ సందర్భోచితంగా కనిపిస్తాయి. అయితే తను దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్ ను హర్షవర్థన్ పాత్రతో చెప్పించడం బావుంది. అతని నటనలో హానెస్టీ ఈ పాయింట్ ను హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యేలా చేసింది.

టెక్నికల్ గా

సంగీతం బావుంది. డ్యూయొట్స్ లేకపోవడం పెద్ద రిలీఫ్. ఉన్న మాంటేజ్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ చీర కట్టుకుని హీరో కార్ వద్దకు వచ్చేటప్పుడు స్టార్ట్ అయ్యే పాటలో సాహిత్యం బావుంది. డైలాగ్స్ చాలా బావున్నాయి. సినిమా తక్కువ లొకేషన్స్ లో సాగినా బోర్ లేకుండా ఉందంటే అది సినిమాటోగ్రఫీ గొప్పదనం. ఎడిటింగ్ పరంగా మార్కెట్ సీన్స్ లో కొన్ని కట్స్ పడి ఉండాల్సింది. మేకింగ్ పరంగా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా ముఖేష్ ఫస్ట్ అటెంప్ట్ లోనే తను రాసుకున్న పాయింట్ న ఖచ్చితంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఇలా ఏదర్శకుడైనా అతను అనుకున్న పాయింట్ తో ఆడియన్స్ ను మెప్పించగలిగితే సినిమా కమర్షియల్ రిజల్ట్ తో పనిలేకుండా అతను ‘దర్శకుడు’గా సక్సెస్ అయినట్టే.

ఫైనల్ గా : ఓ కొత్త కోణాన్ని అర్థవంతంగా చెప్పిన సినిమా

రేటింగ్ : 2.75/5

- బాబురావు. కామళ్ల

Tags:    

Similar News